బోధ మొదటి భాగము
సాధన విధానము
            (శ్రీ విద్యాసాగర్‌ గారి బోధ 21.11.2016)

కాబట్టి అలా వ్యష్టి, సమిష్టి కర్మలనురెండింటిని కలిపి తెలిసి రద్దు చేసుకునేటటువంటి పద్ధతి ఏదైతే వుందో, అది జ్ఞాన మార్గం.

అందుకని మీరందరూ దేనిని పాటించాలట ఇప్పుడు?
చూడడానికి వ్యవహారంలో కర్మమార్గం లానే కనబడుతోంది.
కానీ ఎవరైతే అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నారో,
వారికి మాత్రం జ్ఞానమార్గం.

ఈ పనే... పనేమీ మారలేదు. పని ఏమన్నా మారిందా?
అదే నిద్ర, అదే మెలకువ, అదే కల, అదే లేవడం, అదే పడుకోవడం, అదే సామాన్య ధర్మం, అదే శరీరపోషణ, అంతా అదే, అంతా అదే! ఏం మార్పు రాలేదు.

కానీ లక్ష్యం ఏమైపోయింది? అంటే...
జ్ఞానమార్గంలో పెట్టుకున్నావు.
అప్పుడు నీ జీవితంలో ఫలితాలు ఎటువైపు వచ్చినాయి?
జ్ఞానమార్గంగా వచ్చినాయి.

అదే నువ్వు కర్మమార్గానికి సంబంధించినటువంటి ఆసక్తతతో వున్నావు.
అప్పుడు ఏమయ్యింది?
ద్వంద్వాలతో కూడుకున్నటువంటి, ఫలాసక్తతతో కూడినటువంటి, సుఖదుఃఖాలతో కూడినటువంటి జీవితం లభించింది.
ఇట్లా మనం... చేసే చేత మారలేదు కానీ... చూసే దృష్టి మారుతోంది’.

ఈ సత్యాన్ని గ్రహంచి మనం ఎప్పుడైతే మన దృష్టిని జ్ఞానమార్గంలో స్థిరంగా వుంచుకుంటామో, అప్పుడు సమస్య ఏమి వుంది?
అంతటా ఈశ్వరుడు వున్నాడనేది నీకప్పుడు స్వానుభూతం కదా!

జ్ఞానమార్గంలో వున్నవాడికి అంతటా ఈశ్వరుడు వున్నాడనేది స్వానుభవం”.

కర్మమార్గంలో వున్నప్పుడు “ఊహ”. వీడూ అదేమాట అంటాడు, కానీ అప్పుడు వీడకది ఊహ. అర్థమైందా అండీ!
ఇప్పుడు ఒప్పుకుంటాడు. కానీ జీవుడు వేరే, దేవుడు వేరే. కర్మమార్గంలో వున్నప్పుడు.
జ్ఞానమార్గంలోకి వచ్చేటప్పటికి ఏమైంది?
జీవుడు దేవుడు ఒక్కటే.
అప్పుడు అంతటా వున్నది... భగవంతుడు ఒక్కడే.
జీవుడు వేరుగా, ఈశ్వరుడు వేరుగా లేవు, జగత్తు వేరుగా. ఆ రకమైనటువంటి దృష్టిలో మార్పును ఎవరైతే సాధిస్తారో, వాళ్ళు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇదే ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే!

ఎవరి దృష్టిలో అయితే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనేటటువంటి మూడు.... త్రిపుటి భేదం లేకుండా పోయిందో వాడు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాడు. వారు ఆత్మనిష్ఠుడు అయ్యాడు”.

అందుకనీ శాస్త్రం స్పష్టంగా ఎంతసేపూ... ఆత్మను గూర్చి వివరించమంటే, త్రిపుటిలను గురించి వివరిస్తూ వుంటుంది. ఎందుకని?
(త్రిపుటులు) అవేగా నువ్వు దాటవలసింది. అవి తెలియకపోవడం వలన దాటటం లేదు. బాగా తెలుసుకుని వాటిని అధిగమించి జీవించేటటువంటి జీవితాన్ని... ఈ జీవితంలోనే సాధించాలి.
సాధించాలి అంటే ఏం కావాలి?
తీవ్ర మోక్షేచ్ఛకావాలి, ‘తీవ్ర వైరాగ్యంకావాలి. రెండు. రెండు రెక్కలన్నమాట అవి.
తీవ్రమోక్షేచ్ఛ వుండాలి, తీవ్రవైరాగ్యం వుండాలి.
తీవ్ర వైరాగ్యం వుంటే... తీవ్ర మోక్షేచ్ఛ కలుగుతుంది.
తీవ్ర మోక్షేచ్ఛ వుంటే... తీవ్ర వైరాగ్యం కలుగుతుంది.
ఇవి పరస్పరం అన్నమాట. ఒకదానికొకటి.
ఈ రెండిటిలో దేనిలో లోపం వచ్చినా....
వెంటనే జ్ఞానమార్గంలోనుంచి ఎక్కడికి పడిపోతావు?
కర్మమార్గంలోకి పడిపోతావు.

మధ్యలో భక్తి మార్గంఅనేది ఇంటర్మీడియరీ స్టేజ్‌ (intermediary stage) అన్నమాట.
కష్టాలు వచ్చినప్పుడు ఈశ్వరుడుకనబడుతూ వుంటాడు.
కష్టాలు పోయినప్పుడు అప్పుడు ఈశ్వరుడు కనబడడు. అర్థమైందా అండీ!

మరి మనలో ఆ భక్తిమార్గం యొక్క ప్రభావం ఎట్లా వుంటుందంటే... ఆ వేదనలను బట్టి. ప్రారబ్ధ కర్మ విశేషం చేత ఏర్పడిన వేదనలను బట్టి, మనలో ఆ ఈశ్వరాయత్త చిత్తంఏర్పడుతూ వుంటుంది. అందుకని భక్తిమార్గం ఇంటర్మీడియరీ అన్నమాట.

ఇదే “భక్తిమార్గం విశేషంగా వున్నప్పుడు జ్ఞానమార్గం అయిపోయింది. సామన్యం అయిపోయినప్పుడు కర్మమార్గం అయిపోయింది”.

అంటే... ఉన్నది అసలు భక్తిమార్గమే.

నువ్వు భౌతికంగా పదార్థంలోకి పడిపోతే, కర్మమార్గం అయిపోతుంది.
అదే భక్తి విశేషించి నీవు ప్రభావితమై, నీకు పరాభక్తిగా మారినప్పుడు అదే జ్ఞానమార్గంగా మారిపోయింది.

కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు అనే తలంపు
కర్మమార్గంలోనూ ఆ విశ్వాసం వుంది.
భక్తిమార్గంలోనూ వుంది.
జ్ఞానమార్గంలోనూ వుంది.
స్థాయీభేదంగా వుంది కాకపోతే. అర్థమైందా అండీ!

నా శక్తికి లోబడి నేను అన్నీ చేస్తున్నాను, నేను చేస్తున్నాను - ఇది కర్మమార్గం.
నేను చేయడం లేదు, ఈశ్వరుడే చేస్తున్నాడు - ఇది భక్తిమార్గం.
నేను ఈశ్వరుడు ఒక్కటే - జ్ఞానమార్గం. ఇది దృష్టిభేదం. అర్థమైందా అండీ?

ఇట్లా మనం స్థిరంగా వుండడం.... ముందు అభ్యాసం చేయాలి. అది.
చెదిరిపోకూడదు. మన తగాదా అందరికీ ఏమిటి? ఒకటే సమస్య ఇప్పుడు!
అందరికీ అన్నీ తెలుసు, సమయం వచ్చినప్పుడు మాత్రం ఉండడు.
తెలిసి ప్రయోజనం ఏముంది మరి అప్పుడు? ఔనా కాదా?
చదివాం. తెలుసుకున్నాం. ఆచరించాలి కదా!
ఆచరణ ఎప్పుడు చేయాలి?
తగిన పరిస్థితి వచ్చినప్పుడు చేయాలి.
అంతేనా కాదా?!
విషయం రానంత సేపు, అందరూ ఆత్మస్వరూపులే.
విషయం వస్తే? అయిపోయే...!
మరి అప్పుడు ఏమైంది?
అంటే ఈ విచారణ అంతా అప్పుడు అటక ఎక్కింది.
విచారణ చేయడం ద్వారా నీవు పొందినటువంటి సమర్థతని... విషయం వచ్చినప్పుడు వినియోగించాలి కదా! అంతేనా? కాదా!

చేయి కాలుతుందని తెలిసిందిగా. అనుభవం అయ్యిందిగా.
మరి ఇప్పుడు జాగ్రత్తపడాలా వద్దా ముందు?
కానీ ఇప్పుడు ఎలా వున్నావు?
కాలుతుందనీ తెలుసు, అయినాసరే ముట్టుకోక మానడం లేదు.
ఇప్పుడు ఇది అజ్ఞానం అందామా? మూఢత్వం అందామా?
మూఢత్వం.
ఎందుకనీ?
తెలిసి చేస్తున్నాముగా...!
తెలిసి చేస్తే మూఢత్వం”. అర్థమైందా?
మార్చుకోలేకపోవడం మూర్ఖత్వం”. అర్థమైందా?

మన చెయ్యే కాలుతోందండీ! మనకే బాధ కలుగుతోందండీ!
కుండ పగులేస్తున్నాము, పశ్చాత్తాప పడుతున్నామా లేదా?
అయిపోతుందిగా.... విషయం ఎంతోసేపు వుండడం లేదుగా.
కొద్ది సేపు వుంది. అయిపోయినాక ఏమయ్యావు?
సుఖమో, దుఃఖమో అనుభవించావు.
అనుభవించినాక మొదలుపెట్టావు కథ.
ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడినా?
అది ముందు వుండవచ్చుగా? అవునా?కాదా?
ఇప్పుడు దీనివలన ఏమైంది?
పరిణామం వచ్చినా కూడా, గ్రహించడం లేదు మనం.
గ్రహిస్తే ఏమైంది?
అప్పుడు అలా వుండడం లేదుగా నువ్వు. అవునా? కదా!

వివేకం ఒకసారి వచ్చేస్తే, ఇక మరలా నువ్వు అవివేకంతో ప్రవర్తించే అవకాశం లేదు”.

వుందా? మనందరం ఇప్పుడు వెనక్కు వెళ్ళి, పాతకాలంలో ప్రాకాడం కదా...
నేలమీద, అలా ప్రాకగలమా ఇప్పుడు?
లేదు, ఏమి?
ఆ పరిణామం మారిపోయింది. వివేకం మారిపోయింది. అర్థమైందా?
ఆ స్థితి మారిపోయింది.
ఇప్పుడు వెనక్కు వెళ్ళాలంటే?
ఇహ వెనక్కు వెళ్ళలేము. అర్థమైందా?
అట్లాగే, ‘ఆత్మవిచారణ చేసిన ప్రతి ఒక్కరూ కూడా....
ముందు
నిత్యానిత్యవస్తువివేకాన్ని కోల్పోకూడదు”.
ఆత్మానాత్మవివేకాన్ని కోల్పోకూడదు”.
ఈ రెండూ కోల్పోకుండా నిలబెట్టుకోగలిగినప్పుడు మాత్రమే
నువ్వు మానసిక ఆశ్రయాన్నికలిగివున్నావు.

ఈశ్వరుడితోటో, సద్గురువుతోటో నువ్వు మానసిక ఆశ్రయాన్ని కలిగివున్నప్పుడు మాత్రమే అది వీలౌతుంది. లేకపోతే వీలుకాదు. అర్థమైందా?

కాబట్టి అలా చేయాలా వద్దా?
చేయాలి కదా!

(సద్గురువుతో మానసిక ఆశ్రయం) చేయడానికి మనకి ఏం లోపం ఇప్పుడు?
మన దగ్గర ఏం లేవు?
అన్నీ వున్నాయా? లేదా?
వేదాంత బోధ - [ready] రెడీగా వుంది.
విచారణ క్రమం - అంతా వుంది.
సాంఖ్యవిచారణ అంతా మనకు ఇప్పుడు అందుబాటులోనే వుందా? లేదా?
తెలియదు అని చెప్పే అవకాశం వుందా?
అందరికీ ఉపదేశం వుంది.
అందరకీ పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ పఠాలు... ఆడియోలు, వీడియోలు, సీడీ ఏది... దేనికీ కొదవ లేదండీ! అవునా కదా?
ప్రార్థనలు, జపాలు, తపాలు, ఉపదేశమంత్రాలు... అన్నీ అయిపోయినాయా లేదా?
మరి సాధించామా?
ఎందుకనీ?
ఒక్కడు కూడా రావడం లేదు,
ఏవండీ! నేను పూర్తి చేశానండీ బాబు, సాధించాను.
ఎవరు చెప్పాలది ఇప్పుడు?
నువ్వే చెప్పాలి. అర్థమైందా?
నువ్వు చెబితే ఉత్తీర్ణుడువి అయ్యావో... లేదో... చూస్తారు.

అంతేగానీ... ఎవరూ చెప్పలేదనుకోండి, పరీక్ష ఎవరికి పెట్టాలి ఇప్పుడు?
వింతైన విషయం ఏమిటంటే...
వ్యవహార విద్యకి వేదాంత విద్యకి ఒక తేడా వుంది. వ్యవహార విద్యలో పాఠం చెప్పి అందరికీ పరీక్ష పెడతారు. వేదాంత విద్యలో అట్లా (అందరికీ కలిపి ఒకే పరీక్ష) పెట్టడం కుదరదు.
ఎవరైతే నేను ఉత్తీర్ణుడను అయ్యానుఅని ముందుకు వస్తాడో, వాడికి పెడతారు పరీక్ష. [certificate] సర్టిఫికేట్‌ ఇవ్వడానికి. అర్థమైందా అండీ?
కాబట్టి అందరికీ పరీక్ష పెట్టడం, ఇక్కడ కుదరదు.
అందరికీ బోధించడం కుదురుతుంది ఇందులో.
అందరూ అనుసరించవచ్చు.
కానీ అందులో కొందరే శిష్యులౌతారు.
ఆ శిష్యులలో కొందరే సచ్ఛిష్యులౌతారు.
ఆ సచ్ఛిష్యుల్లో కొందరే పుత్రులౌతారు. అర్థమైందా?
కొందరే సద్గురువుతో ఐక్యతాసిద్ధిని సాధిస్తారు.

ఆ మార్పు అనేది ఎట్లా చెబుతారు అంటే నేను సిద్ధం [I am ready] ఐయామ్‌ రెడీ... అన్నవాడికి,
ఆహా! నువ్వు ఎలా రెడీనో చూస్తారన్నమాట. ఆ స్థాయిని బట్టి పరీక్షపెడుతారు.

అనుసరించేవాడు శిష్యుడు. నవ్వు శిష్యరికానికి ఎట్లా సరిపోయావు?
సచ్ఛిష్యునిగా ఎట్లా సరిపోయావు?
పుత్రుడిగా ఎట్లా సరిపోతావు?
ఐక్యతాసిద్ధికి ఎట్లా సరిపోతావు?

అట్లా వుంటాయి పరీక్షలన్నమాట. అప్పుడు దానిని బట్టి నీకు సర్టిఫికేట్‌ ఇస్తారన్నమాట. ఆ సర్టిఫికేట్‌ ని బట్టి, నువ్వు

అనుసరించేవాడి నుంచి శిష్యుడిగాను,
శిష్యుడి నుంచి సచ్ఛిష్యునిగాను,
సచ్ఛిష్యుని నుంచి పుత్రుడిగాను,
పుత్రుడి నుంచి ఐక్యతాసిద్ధిని సాధించినటువంటి స్థితికి చేరతారన్నమాట.
ఇవి గురువు పెట్టే పరీక్షలంటే అర్థం.

అంతేగానీ... ఇక్కడేమీ మౌఖికమైన పరీక్షలు ఏమీ వుండవు. ఇంటర్వ్యూ [interview] లు ఏమీ వుండవు. రాత పరీక్షలు అంతకంటే ఏమీ వుండవు. నీ జీవితమే నీకు పెద్ద పరీక్ష. ఇంకా వేరే ఏమీ లేదు. ఎవరో పెట్టేది ఏమీ లేదు. నువ్వు, ప్రకృతిరెండే వున్నాయి అక్కడ. అంతేనా కాదా?

మనమందరం ఈ ప్రకృతిలో భాగమేగా. మన శరీర ప్రాణ మనో బుద్ధులు అన్నీ ఈ ప్రకృతిలో భాగంగానే వచ్చినాయి కదా! వేరే ఎక్కడి నుంచీ వచ్చినాయి?

కాబట్టి            ఈ ప్రకృతి అంతా ఈశ్వరుడే...
ఈ సృష్టి అంతా ఈశ్వరుడే.
ఈ సృష్టి అంతా సద్గురువే”.

మరి అప్పుడు ఎవరినైనా మనం ఏమన్నా అనగలమా? మరి ఇప్పుడు ఎవరినన్నా ఏమన్నా అంటున్నామా? లేదా?
అయిపోయింది. ఇంకా ఏముంది?
పొద్దున లేచింది మొదలు, రాత్రి నిదురపోయే లోపల... ఎవరినో ఒకరిని ఏమీ అనకుండా వుంటున్నామా?
ఎందుకనీ? ఏమన్నా అంటే ఎవరిని అంటున్నావు?
ఆ ఈశ్వరుడినే అంటున్నావు.
ఆ సద్గురువునే అంటున్నావు.
ఒక ప్రక్కేమో ఆ ఈశ్వరుడి కృపే అడుగుతున్నావు. ఆ సద్గురు కృపే అడుగుతున్నావు.
ఇప్పుడు తెల్లారి లేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకూ ఎవరిమీద ప్రదర్శిస్తున్నావు?
ఆయన పైననే...!
ఇది ఎట్లా కుదురుతుంది?
వారినే తిడుతూ.... వారినే విమర్శిస్తూ... వారి కృపను మనం అడిగితే అది వీలౌతుందా?

శి: ఆయన సద్గురువుగా తెలియడం లేదుకదండీ!
గు: ఆ దృష్టిరాలేదు. తెలియట్లేదు అంటే ఆ దృష్టిరాలేదు.

(ఉన్నదంతా సద్గురువే, ఉన్నదంతా ఈశ్వరుడే అనే)
దృష్టివస్తే... అంతా గురుస్వరూపంగానే కనబడుతుంది.

అంటే మనం సాంఖ్య విచారణని ఉపయోగ పెట్టుకోలేదు.
మన పంచీకరణ గోలని... పంచీకరణే! జీవితం... జీవితమే! అర్థమైందా అండీ!

మీ అందరికీ పంచీకరణము వచ్చా? రాదా?
వచ్చు.
సాంఖ్య విచారణ వచ్చా? రాదా?
బాగా వచ్చు.
అన్నీ తెలుసా? తెలియదా?
అన్నీ తెలుసు.

పంచకోశాలు తెలుసు, గుణత్రయాలు తెలుసు, అవస్థాత్రయాలు తెలుసు, శరీతత్రయాలు తెలుసు, దేహత్రయాలు తెలుసు, తాపత్రయాలు తెలుసు, (ఈషణత్రయాలు తెలుసు) .... వివేకచూడామణి చెప్పినవన్నీ తెలుసు. ఔనా? కాదా?
మరి ఇప్పుడు ఎందుకు మారలేదు మనం?

అంటే నువ్వు ఆచరించేటప్పుడు
ఆ జ్ఞానాన్ని వినియోగించి ఆచరించడం అనే నిర్ణయం” చేయడం లేదు.
చేస్తే ఏమయ్యావు?  
దృష్టి మారిపోయింది”. అర్థమైందా?

ఇప్పుడు నువ్వు అన్నం రోజూ ఎవరికి వండుతున్నావు?
శి. “ఈశ్వరుడు”కి, “సద్గురువు”కి.

గు. అంతేనా కాదా?
మరిప్పుడు... సమస్య ఏమి వచ్చింది అప్పుడు?
ఏమీ రాలేదుగా?
కానీ వండేటప్పుడు ఏమనుకుంటున్నావు?
శి. మా ఆయనకి, పిల్లలకి వండి పెడుతున్నాను’ - అని...
గు. అయిపోయే! ఇదీ తగాదా! అర్థమైందా?
నేను తినడానికి వండుకుంటున్నాను, మా ఆయనకు వండిపెడుతున్నాను, మా కుటుంబానికి వండిపెడుతున్నాను. ఇలాంటి భేదదృష్టితో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం.... విషయక్రమం వచ్చేటప్పటికి మాత్రం... ఆ అభ్యాస బలంతో అట్లా అయిపోతున్నామన్నమాట! 
ఇప్పుడు ఈ అభ్యాసాన్ని ఏమి చెయ్యాలి మరీ?
ఉల్టా... రివర్స్‌ [reverse].... వ్యతిరేకం చేయాలి.
చేసి, పూర్వం వున్నటువంటి వేగాన్ని వడిని తగ్గించాలన్నమాట !

ఇదీ “మనసు మౌన పడడం” అంటే!

మనసు మౌనపడిపోతే ఇంకా అప్పుడు విషయాల గొడవలేదుగా. అప్పుడు కర్మానుసారంతో వున్న జీవితం లేదు”.
మనసు మౌనపడనంత వరకూ ఆ వృత్తులు వస్తూనే వుంటాయి, ఆ వృత్తుల నుంచీ విషయాలు వస్తాయి, విషయాల నుంచీ క్రియలొస్తాయి, క్రియల నుంచీ ఫలితాలు వస్తాయి, ఫలితాలు సుఖదుఃఖాలవుతాయి, సుఖదుఃఖాలు స్మృతులౌతాయి, స్మృతులు వాసనలు అవుతాయి. వాసలు డింగ్‌... మని తిరిగి ఇటు వచ్చేస్తుంది.
ఇది సైకిల్‌ (cycle)
మరి ఈ సైకిల్‌ని మనం రోజూ గమనిస్తున్నామా?
ఏ రోజుకారోజు గమనిస్తున్నామా?
ఏ క్షణానికి ఆ క్షణం గమనిస్తున్నామా? అని చూసుకోవాలి.
అప్పుడు ఏమయ్యావు?
[I am alright] ఐ యాం ఆల్‌ రైట్‌.
నేను సదా ఈశ్వరుడనే’.
ఏ క్షణానికి ఆ క్షణం వున్నవాడికి ఏమైంది ఇప్పుడు?
వాడికి గతం లేదుగా!

గతం యొక్క స్మృతి ప్రభావం లేదు - ఒక వృత్తి పోయింది.
భవిష్యత్తు యొక్క ప్రణాళికలు వేసే విధానం లేదు - సంకల్పవికల్పాలు పోయినాయి.
దాని వల్ల వచ్చిన విపరీతజ్ఞానం... విపర్యయం లేదు.
ఈ నాలుగు వృత్తి భేదాలు లేనప్పుడు నిద్రఅనే గొడవలేదు.
అప్పడు ఆ చిత్తవృత్తి యొక్క విశేషంపనిచేయడం లేదుగా.

శి: జ్ఞాపకాలు, ఊహలు లేకపోతే అసలు నిద్ర వుండదా అండీ?
గు: ఎందుకు వుంటుంది? ఈ నాలుగు వృత్తులు కలిసి ఆ నిద్ర అయ్యింది.

ఈ సంకల్ప, వికల్ప, విపర్యయ, స్మృతులు కలిస్తేనే... నిద్ర అయ్యింది. లేకపోతే అవ్వడం లేదు”.

శి: నిద్ర రాకపోతే...
గు: ఏమౌతుంది?
శి: అప్పుడేంటి?
గు: నీకు అవసరం ఏర్పడితే, నిద్రపోక తప్పదు. అంటే...
పూని నిద్ర మానగరాదు, పూని నిద్ర పోరాదు
మనం రెండు పనులను చేస్తుంటాము. ఏం చేస్తుంటాము?
పదయ్యింది..... 
ఠంచనుగా అలార్మ్‌ కొట్టింది. మెలకువ వచ్చినా రాకపోయినా మెల్లగా ఐదింటికి నిద్రలో తూలుతూ లేస్తాడు.
ఏమయ్యాడు ఇప్పుడు?
రెండూ దెబ్బతిన్నాయి. పూని నిద్ర పోరాదు, పూని నిద్ర మానగరాదు. మెలకువ వచ్చినప్పుడు లేవాలి.
ఇప్పుడు నువ్వేం చేశావు?
అభ్యాసం... ఏయ్‌! అలవాటు చేసుకో! రోజు నాల్గింటికి లెగవడం.
మంచిదే! కానీ, ఆ అభ్యాసం ఎలా వుండాలి?
అది సరిపోవాలి అక్కడికి. అంతేగానీ... లేచిన తరువాత ఇంకా రెండు గంటల సేపు మత్తులోనే బుద్ధిపని చేసేట్టుగా వుంటే అప్పుడు ఏమైంది?
ఈ లేచింది వృధా అయిపోలేదా?
ఇంకా ఏమైంది?
లోపల ఒత్తిడి పెరిగిపోతుంది.
కాబట్టి
పూని నిద్ర మానగ రాదు, పూని నిద్ర పోరాదు.

ఎందుకనిట? ఎందుకు చేయకూడదు అది?
నిద్రలో అతి భద్రముగా వున్నది, నిజమగు విద్య
కాబట్టి నిజమైన జ్ఞానమంతా ఎక్కడుంది?
నిద్రలో వుంది.
ఎందుకని అలా చెప్పారు?
నిద్రలో ప్రపంచం లేదు, నిద్రలో విషయాలు లేవు, నిద్రలో క్రియలు లేవు, నిద్రలో ద్వంద్వాలు లేవు, నిద్రలో నువ్వు ఒక్కడివే వున్నావు”. ఇంకా ఎవ్వడూ లేడు. అవునా? కాదా !
అప్పుడు స్వరూప జ్ఞానంతెలుసుకోవడం సులభం కదా!
ఇవన్నీ వున్నప్పుడు స్వరూపజ్ఞానం తెలుసుకోవడం సులభమా?
ఇవన్నీ లేనప్పుడు తెలుసుకోవడం సులభమా?
శి: లేనప్పుడు తెలుసుకోవడమే సులభం.
గు: కానీ... ఎప్పుడు వీలౌతుంది?
శి: నిద్రలోనే...!
గు: మరి ఆ నిద్రని సాధనగా మార్చుకుంటేనేవీలౌతుంది.
మరి నిద్రని సాధనగా మార్చుకున్నామా?
మార్చుకోలేదుగా. మార్చుకుంటే తప్ప... అవస్థాత్రయాన్ని దాటలేం.
మరి అవస్థాత్రయాన్ని దాటే ప్రయత్నం చేసామా? ఏమన్నా?
కాబట్టి మనం నేర్చుకున్న సాంఖ్య విచారణఅంతా ఇప్పుడక్కడ వాడాలా వద్దా?
వాడాలి కదా!
కాబట్టి ఈ రకమైనటువంటి జీవితాన్ని మనం, నిజజీవితంలో ఎవరైతే, సాధనాపూర్వకంగా జీవిస్తారో,
ఎవరైతే...
తెలిసి దాటాలండీ...!!
ఎవ్వరి కైనా ఒకటే రూల్‌ [rule], అక్కడ ఎవ్వరికీ ఎగ్జంప్షన్‌ [exemption] లేదు.
మాకు ప్రియ శిష్యుడండీ, ఈవెడికి కొద్దిగా ఎగ్జంప్షన్‌ ఇవ్వండి, ప్రక్కదారిలోనుంచి వెళ్ళడానికి అనడానికి (అవకాశం) ఏమీ వుండదు.

అత్యంత సూక్ష్మమైన మార్గం. సూక్ష్మతరమైన మార్గం. సూక్ష్మతమమైన మార్గం.

పురోగమించడమే తప్ప, తిరోగమించడం వుండదు.
ఎంత ప్రయత్నం చేస్తే, అంతే ఫలితం’.
అర్థమైందా అండీ?

రికమెండేషన్లు [recommendations] పనిచేయవు అక్కడ.
ఎక్కడ పని చేస్తాయి?
అధిగమించే స్థితికి వస్తావు చూడు....
ఈ పరిణామం అంతా పొంది, అధిగమించే స్థితికి వస్తావు. అప్పుడు పనిచేస్తాయి. చివరిమాట పనిచేస్తుందన్నమాట. నువ్వు అన్ని ఎగ్జామ్‌లు పాస్‌ (passed in all exams) అయిపోయి, రిటెన్ (written), ఓరల్‌ (oral) ఎగ్జామ్స్‌ అన్నీ పాస్‌ (pass) అయిపోయి, చివరికి పోస్టింగ్‌ (posting) ఇచ్చే టైం (time) వస్తుందే... అప్పుడు ఒక్కమాట చెబుతారన్నమాట. ఆ మాటకి విలువ వుంటుంది. అప్పుడు వీలౌతుంది.

కాబట్టి మనం... నిజజీవితంలో ప్రతీ ఒక్కరూ స్వయంకృషితో.... ఆత్మనిష్ఠవరకూ స్వయంకృషితో రావల్సిందేనండీ!
కాబట్టి దానిని ఏం న్యాయమన్నారు? ఏం న్యాయమన్నారు?
శి: మర్కట కిశోరన్యాయం.
గు: నీ ప్రయత్నమే కాబట్టి మర్కట కిశోర న్యాయం. అర్థమైందా అండీ!
ఆత్మనిష్ఠ నుంచీ బ్రహ్మనిష్ఠకి భ్రమరకీటక న్యాయం’ ....
ఆత్మనిష్ఠ నుంచీ బ్రహ్మనిష్ఠుడవు అవ్వాలంటే... భ్రమర కీటక న్యాయం. అర్థమైందా అండీ!
పరబ్రహ్మనిర్ణయాన్ని పొందాలి... అప్పుడేమి చెయ్యాలి?
అప్పుడు మార్జాల కిశోర న్యాయం. అప్పుడు నీ ప్రయత్నం చాలదన్నమాట. నీ పాత్ర జీరో [zero]. అప్పుడంతా సద్గురువే చూసుకుంటాడు.
కాబట్టి... ఎవరెవరైతే ఉపదేశక్రమంలో... ఇప్పుడు మహావాక్యాలు పొందేసారా మీరంతా? అయిపోయిందా? మీలో ఎవరో? ఎక్కడిదాకా వచ్చారు? “త్రయం” అయిపోయిన వాళ్ళు వున్నారుగా...
మీరందరూ ఉపదేశం తీసుకోలేదా?
మురళీకృష్ణగారి దగ్గర తీసుకున్నారుగా...
అమ్మగారు... నిర్మలగారు ఇచ్చారా?
ఏమి ఇచ్చారు?
హంసమంత్రంఇచ్చారా?
రెండవది అంటే... ఓహో! అదే నాలుగు మహావాక్యాలు... తత్త్వమసి’ ...ఊఁ... అది.

కాబట్టి మహావాక్యాలు ఎక్కడ ఉపయోగపడుతాయి?
అంటే ఆత్మనిష్ఠ నుంచీ బ్రహ్మనిష్ఠ దగ్గరవరకూ ఉపయోగపడుతాయి.

ఆత్మనిష్ఠ వరకూ ఏమి ఉపయోగపడాలి? అంటే...
హంస” మంత్రమే ఉపయోగపడాలి.

హంసమంత్రం ద్వారా నీవు ఆత్మనిష్ఠుడవు అవ్వాలి. అర్థమైందా?
మహావాక్యాల ద్వారా బ్రహ్మనిష్ఠుడవు అవ్వాలి.
త్రయం ద్వారా పరబ్రహ్మనిర్ణయాన్ని పొందాలి.
పూర్ణం ద్వారా అచల సిద్ధాంతంలోకి ప్రవేశం చేయాలి.
అది అర్థమయ్యిందా? అండీ!

కాబట్టి మీరందరూ అలా నిజ జీవితంలో ఆయా దశలని మనం గమనించుకుంటూ పరిణామం చెందాలన్నమాట.
కాబట్టి ఆ వేదాంత మార్గం ఏదైతే వుందో అదంతా కూడా ఇలాగే... స్పష్టమైన నిర్ణయం ప్రకారమే వాళ్ళు ఆ పాఠాలన్నీ ప్రవేశ పెట్టారు. ఆ పాఠాంతర విద్య కూడా ఈ క్రమంలోనే వుంది. మన పరిణామాన్ని ఉద్దేశ్యించే వుందన్నమాట.
కాకపోతే అదట్లా నిజజీవితంలో మనం... అనుక్షణం విడవకుండా ఉపాసించాలి. ఉపాసనా పూర్వకమైనటువంటిదంతా కూడా కర్మకాండే.
నువ్వు జపం చెయ్యి, తపం చేయి, ధ్యానం చేయి, యాగం చేయి, యోగం చేయి... ఇవన్నీ కూడా కర్మకాండే.
కానీ కర్మకాండకి లక్ష్యం ఎందులో వుండాలి?
ఆత్మనిష్ఠలో వుండాలి.
ముందు ప్రాథమికంగా ఆత్మనిష్ఠలో వుండాలి. ఆత్మనిష్ఠుడిని అనే నిర్ణయం పొందిన తరువాత అప్పుడు బ్రహ్మనిష్ఠకు ప్రయత్నించాలి. అది బ్రహ్మానుసంధానంద్వారా! బ్రహ్మనిష్ఠుడువి అయిన తరువాత... అది వేరు. ఆ గొడవ వేరు. “ఇదంతా లేనిదని నిరూపించాలన్నమాట” అప్పుడు.
ఇదంతా లేనిదని నిరూపిస్తే... పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతావు అప్పుడు.
కాబట్టి ఉన్నదని చెప్పాలా? లేనిదని చెప్పాలా? అంటే మాటలతో చెప్పడమా?
మాటలతో చెబితే అవుతుందా? అంతేనా కాదా?

ఇప్పుడు మీకు... బాల్య, యవ్వన, కౌమార... వృద్ధాప్యం ద్వాకా వచ్చేసావు. మొదటి మూడు స్థితులు వున్నాయా? లేవా? నీకు ఇప్పుడు? లేవు. ఆవిడకి? ఈవెడికి వృద్ధాప్యం వుందా ఇప్పుడు? లేదు. నీకు వృద్ధాప్యం అంటే తెలుసా? లేదు. బాల్యం అంటే తెలుసా? తెలుసు. అయిపోయింది కాబట్టి. యవ్వన, కౌమారాలు దాటలేదుగా.
కాబట్టి... అటూలేదు, ఇటూ లేదు.

ఇట్లా మనం స్వానుభూతి పొందనటువంటివి మనకు తెలియకుండా పోవడం లేదా?
అట్లాగే ఈ అంతర్ముఖ ప్రయాణంలో కూడా అంతే.
నీకు ఆ స్థితి గురించి చెప్పగానే, తెలిసిన వాడైతే ఏమన్నాడు?
ఆ నాకది తెలుసండీ బాబు, నాకు ఆ నిర్ణయమంతా తెలుసు. స్వానుభూతిగా తెలుసు అన్నాడు. అర్థమైందా?

అదే ఆ పరిణామం పొందని వాడు ఏమయ్యాడు?
ఆ శాస్త్రం చదువుతాడు. కానీ... “నేను అదే అయి వున్నాను” అనే స్ఫురణకలుగదన్నమాట.
ఇప్పుడు మీరు వివేకచూడామణో, అష్టావక్రగీతో, వేదాంత పంచదశో... చదవడమో వినడమో చేస్తున్నారమ్మా...!
అక్కడేదన్నా ఒక వాక్యం రాగానే...
ఆఁ.... ఇది నాకు సరిపోయింది. ఇది నాకు సరిపోయింది. ఇది నాకు సరిపోలేదు. అని అనిపిస్తుందా? అనిపించడం లేదా?
రోజూ వాళ్ళు వ్యాఖ్యానం పెడుతున్నారా? లేదా?
అది చదివేటప్పుడు ఏమనిపించాలి?
ఆఁ... నేను సరిపోతున్నానా? దీనికి?
తెలియదు.
సరిపోవడం అంటే... ?
మూడు అవస్థలలోనూ సరిపోతున్నానా?
అది చాలా ముఖ్యం. అర్థమైందా?
మూడవస్థలలోనూ సరిపోతేనే... సరిపోయినట్లు.
అంతేగానీ... ఎప్పుడో ఆలోచన చేసినప్పుడు సరిపోయానండీ!
విచారణ చేసినప్పుడు సరిపోయానండీ!
తరువాత గ్రంథం చదివినప్పుడు సరిపోయానండీ!
అనంటే... చాలదన్నమాట. ఎందుకని?
సహజమైన పద్ధతి.... మూడు అవస్థలలోనూ సరిపోతేనే... అది సరిపోయినట్టు.
అంతేనా కాదా? అది.21.11.2016 నాడు ESI లో జరిగిన సత్సంగము, శ్రీ విద్యాసాగర్‌ గారి బోధ....

సాధన విధానము’ Part one (తొలి ఇరవై నిమిషాలు) బోధ సమాప్తము.